Nara Lokesh: ఉద్యోగాల కల్పనే లక్ష్యం 4 d ago

AP: ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు పౌరుషం ఎక్కువ, అదే విధంగా ప్రేమ కూడా ఎక్కువే అని అన్నారు మంత్రి నారా లోకేష్. ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబుపై, టీడీపీపై అభిమానం ఉందని, అందుకే టీడీపీ తరుపున 2019లో నలుగురు శాసన సభ్యులను, అదే విధంగా 2024 ఎన్నికల్లో 10 మందిని గెలిపించారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా సాగిందని, ఈ పాదయాత్రలో ఇక్కడ ప్రజల కష్టాలను చూశానని తెలిపారు. ఈ జిల్లాలో 2022లో నిర్వహించిన టీడీపీ మహానాడు వలనే ఆంధ్ర రాష్ట్రంలో మార్పు మొదలైందన్నారు.
ఏపీలో 2019 నుంచి 2024 విధ్వంస పాలన నడిచిందని, కొత్త కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను తరిమేశారన్నారు. ప్రకాశం జిల్లాకు పెద్ద ప్యాపర్ మిల్లు తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసిందన్నారు. లూలూ, అమర్‌రాజా, హెచ్ఎస్‌పీసీ, జాకీ వంటి సంస్థలను వెళ్లగొట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యువగళం పాదయాత్ర చేశానని, ఈ పాదయాత్ర తనలో మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని, దేశంలో ఏ పార్టీ చేయలేని సాహసం ఎన్డీఏ చేసిందని తెలిపారు.
దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కదుర్చుకుని పనులు ప్రారంభించామన్నారు. అందులో భాగంగానే ఇక్కడ సీబీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, వైసీపీ హయాంలో ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో టీడీపీ ప్రభుత్వం పని చేసిందని, తన బ్రాండ్ సీబీఎన్ అని చెప్పారు.